తాలిబన్లకు మద్దతు ఇచ్చే పార్టీతో టిఆర్ఎస్‌ స్నేహం: బిజెపి

బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తాలిబన్లకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. తాలిబన్లకు మద్దతు ఇస్తున్న పార్టీ(మజ్లీస్‌)తో అధికార టిఆర్ఎస్‌ దోస్తీ నెరుపుతూ దాని సాయంతో రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తోంది,” అని ఆరోపించారు. 

బిజెపి ఆరోపణలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. శుక్రవారం టిఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో తాలిబన్లు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు ఉన్నారంటే అది ఖచ్చితంగా కేంద్రప్రభుత్వ వైఫల్యమే. ఒకవేళ వారిపై చర్యలు తీసుకోవడం చాతకాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఆ బాధ్యత అప్పగించాలి. శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్: 1 స్థానంలో ఉన్నారు,” అని అన్నారు.