
ఈ నెల 27వ తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కృష్ణా నదీ జలాల పంపకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఏర్పడిన తాజా వివాదాలపై చర్చిస్తారు. రెండు రాష్ట్రాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సాగునీటిశాఖ, దానిలోని అంతర్ రాష్ట్ర జలవివాదాల విభాగానికి చెందిన అధికారులతో సమావేశమయ్యారు.
కృష్ణా నదీ జలాలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నీటి వాటాను ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అలాగే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నదీ జలాల పంపిణీ అవుతుండగా దానిని 70:30 శాతానికి మార్చాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కెఆర్ఎంబీకి లేఖ వ్రాయడాన్ని తప్పు పట్టారు. ఎట్టి పరిస్థితులలో దీనిని అడ్డుకోవాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. 2021-2022 సం.లలో తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో 811 టీఎంసీల నీళ్ళు కేటాయించేలా కెఆర్ఎంబీపై ఒత్తిడి చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు అర్ధరహితమని, వాటిపై కూడా సమావేశంలో గట్టిగా వాదించాలని సూచించారు. కెఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తరలించాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కెఆర్ఎంబీ తప్పనిసరిగా కృష్ణా బేసిన్ పరిధిలో ఉండే విజయవాడ లేదా కర్నూల్ నగరాలలో ఏర్పాటుచేసే మాటయితే అభ్యంతరం లేదని సిఎం కేసీఆర్ చెప్పారు.
ఏపీ ప్రభుత్వం కెఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండా కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌కు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కెఆర్ఎంబీ దృష్టికి తీసుకువెళ్ళి, అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.