
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రాన్ని(ఆర్బిట్రేషన్ సెంటర్) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ, తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.
హైదరాబాద్ నగరంలో పలు అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపార సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నందున, అప్పుడప్పుడు అవి వాణిజ్యపరమైన వివాదాలు ఎదుర్కోవలసివస్తుంటుంది. కనుక అంతర్జాతీయ సంస్థల వాణిజ్య వివాదాలకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరమని జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదనకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడంతో హైదరాబాద్‌లో ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైంది.
సిఎం కేసీఆర్ తన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించడమే కాక కేవలం మూడు నెలల వ్యవధిలోనే దీనిని ఏర్పాటు చేసినందుకు కు జస్టిస్ ఎన్వీ రమణ ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇటువంటి గొప్ప ప్రతిపాదన చేసినందుకు మంత్రి కేటీఆర్ జస్టిస్ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.