హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కొండా సురేఖ?

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆ పార్టీ సీనియర్ మహిళా నేత కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైనట్లు తాజా సమాచారం. పార్టీ అభ్యర్ధి గురించి చర్చించేందుకు నిన్న గాంధీభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ దామోదర రాజనరసింహ, నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్తలు, కొండా దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కొండా సురేఖను బరిలో దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆమె కోరినట్లుగానే 2023 శాసనసభ ఎన్నికలలో హుజూరాబాద్‌ టికెట్ ఆమెకే కేటాయించడానికి, అలాగే     వరంగల్‌ పశ్చిమ, పరకాల టికెట్లను తాము సూచించినవారికి ఇవ్వాలనే ఆమె షరతులకి సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే జయశంకర్‌ భూపాలపల్లి టికెట్‌ కూడా తమకే కేటాయించాలానే ఆమె అభ్యర్ధనపై తరువాత చర్చిద్దామని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే టిఆర్ఎస్‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ (యాదవ్)ను అభ్యర్ధిగా ప్రకటించగా, బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్‌ లేదా ఆయన భార్య జమున (ముదిరాజ్) పోటీ చేయడం ఖాయమే. కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త మురళి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. హుజూరాబాద్‌ సుమారు 55 వేల మంది ఆ రెండు సామాజికవర్గాలకు చెందినవారున్నారు. కనుక కొండా సురేఖను అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే వారి నుంచి పూర్తి మద్దతు లభించడంతోపాటు బీసీలలో టిఆర్ఎస్‌, బిజెపిలను వ్యతిరేకిస్తున్నవారి ఓట్లు కూడా కొండా సురేఖకు పడతాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇవాళ్ళ, రేపు మళ్ళీ మరోసారి సమావేశమయ్యి చర్చించిన తరువాత రేపు సాయంత్రంలోగా కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.