కరుడుగట్టిన రాక్షసత్వం ప్రదర్శించే తాలిబన్లను చూసి ఆ దేశ ప్రజలే భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతుంటే, మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారత్ ప్రభుత్వం వారితో చర్చలకు సిద్దపడాలని సూచించడం విశేషం. అసలు ఆఫ్ఘనిస్తాన్ సమస్య... తాలిబన్ల పాలనపై భారత్ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించినా గుర్తించకపోయినా దేశ ప్రయోజనాల కోసం, వ్యూహాత్మక రక్షణ కోసం తాలిబన్లతో చర్చలకు ద్వారాలు తెరిచి ఉంచాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. తాను 2013లో ఓసారి, మళ్ళీ 2019లో మరోసారి తాలిబన్లతో చర్చలు జరపాలని కేంద్రప్రభుత్వానికి ఈ సూచన చేశానని కానీ పట్టించుకోలేదని అన్నారు. వివిద దేశాలు తాలిబన్లతో చర్చలు జరుపుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఎవరు ఎన్నిసార్లు తాలిబన్లను కౌగలించుకొన్నారో లెక్క పెడుతూ కూర్చోందని ఎద్దేవా చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ సుమారు మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఏమి చేయాలనుకొంటోంది?అని ప్రశ్నించారు. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే డ్రామాలు చేస్తూ గొప్పలు పోతుంటుందని అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు.