
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబన్లు చుట్టుముట్టగానే ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హెలికాప్టర్‌లో విదేశానికి పారిపోయారు. ఆయన వెళ్ళేటప్పుడు సుమారు 169 మిలియన్ అమెరికన్ డాలర్లు 14 కార్లలో తరలించారని, హెలికాప్టర్ నిండిపోవడంతో మిగిలిన సొమ్మును ఆ కార్లలోనే వదిలేసి తజకిస్తాన్ పారిపోయారని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు తమ దేశంలో ఆశ్రయం కల్పించామని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తరువాత ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు. దానిలో ఆయన ఏమన్నారంటే, “దేశంలో శాంతిభద్రతలు, ప్రజలను కాపాడటానికి, రక్తపాతాన్ని నివారించేందుకే నేను పారిపోయాను తప్ప నా ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు. ప్రస్తుతం నేను యూఏఈలో ఉన్నాను.
నేను భారీగా డబ్బు మూటలతో పారిపోయానని మీడియాలో వస్తున వార్తలను చూసి చాలా చింతిస్తున్నాను. ఏ క్షణంలోనైనా అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించవచ్చని కనుక తక్షణం బయల్దేరాలని నా భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో చెప్పులు వేసుకొనేందుకు కూడా సమయం లేక హడావిడిగా కట్టుబట్టలతో హెలికాప్టర్‌లో వచ్చేశాను. నేను ఇక్కడికి చేరుకొన్నప్పుడు నా ఒంటిపై బట్టలు తప్ప నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కావాలంటే యూఏఈ విమానాశ్రయ అధికారులను అడగండి. ఒకవేళ నేను ఇంకా కాబూల్లోనే ఉండి ఉంటే తాలిబన్లు నన్ను నడిరోడ్డులో ఉరి తీసేవారు. అప్పుడు ఉరికొయ్యకు వ్రేలాడుతున్న నా శవాన్ని మీరందరూ చూసి బాధపడవలసి వచ్చేది. అలా జరగడం ఇష్టం లేకనే నేను పారిపోయి ఇక్కడకు వచ్చేశాను.
నేను దేశం విడిచిపెట్టి వచ్చేసినప్పటికీ, అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఇక్కడి నుంచే విశ్వప్రయత్నాలు చేస్తున్నాను. అక్కడ నా మద్దతుదారులు తాలిబన్లతో దేశంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రయత్నాలు ఫలించి పరిస్థితులు చక్కబడితే నేను దేశానికి తిరిగివస్తాను,” అని చెప్పారు.