ఏపీ సిఎం జగన్‌కు సిబిఐ కోర్టు సమన్లు

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. లేపాక్షి, వాన్‌పిక్ కేసులలో నిందితులుగా ఉన్న జగన్‌తో సహా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఐఏఎస్ అధికారులు బిపి ఆచార్య, డి.మురళీధర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్, జగతి పబ్లికేషన్స్‌తో సహా మొత్తం 24 మందికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరందరూ సెప్టెంబర్ 22వ తేదీన జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ పేరుతో అనంతపురంలో 8,844 ఎకరాలను నిందితులుగా పేర్కొనబడిన కంపెనీలకు నామమాత్రపు ధరకు అప్పగించింది. దానిలో ఇండూ శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.1,326 కోట్లు విలువైన భూమిని కేవలం రూ.119 కోట్లకు అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు సంస్థ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీలలో రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టిందని సిబిఐ కేసు నమోదు చేసింది. 

ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. ఈడీ కేసులో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలతో సహా మొత్తం 21 మందికి సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పైన పేర్కొన్న విదంగానే ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వ్యక్తులు మరియు కంపెనీల నుంచి రూ.854 కోట్లు జగన్‌కు చెందిన సంస్థలలో వెళ్ళినట్లు ఈడీ నిందితులపై అభియోగాలు మోపింది. సిబిఐ, ఈడీ కేసుల విచారణకే సిబిఐ కోర్టు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో సహా 24 మందికి సమన్లు జారీ చేసింది.