జీవోలపై దాపరికం ఎందుకు? హైకోర్టు ప్రశ్న

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలోని దళిత బంధు పధకం కింద 76 దళిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.6 కోట్లు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపై వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ అనే సంస్థ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు దానిపై విచారణ చేపట్టింది. 

వాసాలమర్రిలో ఈ పధకాన్ని అమలుచేస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు దానికి సంబందించి జీవోలను ప్రభుత్వం ఇంతవరకు ఆన్‌లైన్‌లో పెట్టలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది శశికిరణ్‌ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు హైకోర్టు స్పందిస్తూ ప్రభుత్వం వాటి జీవోలను ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదని, జీవోల విషయంలో దాపరికం ఎందుకని ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్ జనరల్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఇకపై జీవోలు జారీ చేసిన 24 గంటల లోపు వాటిని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.