హత్య కేసు నుంచి కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కి విముక్తి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ హత్య కేసు నుంచి ఆమె భర్త కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కి విముక్తి లభించింది. దీనిపై ఏడేళ్ళుగా సుదీర్గ విచారణ జరిపిన ఢిల్లీ సెషన్స్ కోర్టు ఈరోజు ఈ కేసులో తుదితీర్పు వెలువరిస్తూ, శశి థరూర్‌పై మోపిన అభియోగాలను అన్నిటినీ కొట్టివేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఏవైనా సాక్ష్యాధారాలు, పత్రాలు ఉన్నట్లయితే ఢిల్లీ పోలీసులు కోర్టుకి సమర్పించవచ్చని పేర్కొంది. 

2017, జనవరి 17వ తేదీన శశి థరూర్‌, సునందా పుష్కర్ ఢిల్లీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు. శశి థరూర్‌ బయటకు వెళ్ళిన సమయంలో రూమ్‌లో ఒంటరిగా ఉన్న ఆయన భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు దృవీకరించారు. ఆమె ఆత్మహత్య చేసుకొనేలా శశి థరూర్‌ ప్రేరేపించారని ఛార్జ్-షీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించి బెయిల్‌ పొందారు. 

తనపై మోపిన అభియోగాలను న్యాయస్థానం కొట్టివేయడంపై శశి థరూర్‌ స్పందిస్తూ, “ఈ ఏడేళ్ళుగా నేను ఈ కేసు కారణంగా నరకయాతన అనుభవిస్తున్నాను. ఎట్టకేలకు నేను నిర్ధోషినని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.