ఐఏఎస్ అవ్వాలనుకొంటే రాజకీయాలలోకి వచ్చా: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో విద్యార్దులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా నాన్నగారు నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకొని ఢిల్లీలోని జేఎన్‌టీయూకి పంపారు. కానీ అక్కడ గోడలపై వ్రాసిన ఓ సందేశం నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. “ప్రజాస్వామ్యంలో ప్రతీ దానిని రాజకీయాలే నిర్ణయిస్తాయి. కనుక మీ భవిష్యత్‌ ఏమిటో మీరే నిర్ణయించుకోండి,” అనే ఆ సందేశాన్ని చదివిన తరువాత నేను అక్కడ చేరకుండా అమెరికా వెళ్ళి ఉద్యోగంలో చేరాను. ఆ తరువాత యూపీఏ నుంచి టిఆర్ఎస్‌ బయటకు వచ్చేసిన తరువాత నేను నాన్నగారు కాదనరానే ఉద్దేశ్యంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ తిరిగివచ్చేసి రాజకీయాలలోకి ప్రవేశించాను. ఆ తరువాత కధ మీ అందరికీ తెలిసిందే,” అని అన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్ని రంగాలలో ఏవిదంగా అభివృద్ధి చెందిందో మంత్రి కేటీఆర్‌ విద్యార్దులకు వివరించారు. సంక్షేమ పధకాల గురించి వివరిస్తున్నప్పుడు దళిత బంధు పధకం గురించి విద్యార్దులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “గత 75 ఏళ్ళలో దళితుల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేయూత అందించి పైకి తీసుకువచ్చేందుకు సిఎం కేసీఆర్‌ ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ఏ పధకం ప్రవేశపెట్టినా ఎంతో లోతుగా ఆలోచించిన తరువాతే అమలుచేస్తుంటారు. ఆ తరువాత దానిని విజయవంతం చేసేవరకు వెనుతిరగరు. దళిత బంధు పధకం కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది. రాబోయే 4-5 ఏళ్ళలో రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దీనిని అందజేస్తాం,” అని అన్నారు.