
ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొన్న తాలిబన్లు ఈరోజు కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజలందరినీ తాము క్షమిస్తున్నామని కనుక అందరూ నిర్భయంగా తమ పనులు చేసుకోవచ్చునని ప్రకటించారు. అలాగే తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు, ప్రభుత్వానికి సహకరించిన ప్రభుత్వోద్యోగులు, అధికారులను కూడా క్షమిస్తున్నామని ప్రకటించారు. కనుక ప్రభుత్వోద్యోగులు, అధికారులు తక్షణం విధులలో చేరాలని కోరారు.
తాలిబాన్లు ఎవరూ ప్రజల జోలికి వెళ్ళవద్దని, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళవద్దని, ఎవరి ఇళ్లలోకి వెళ్ళవద్దని వారి అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రజల ధనమానప్రాణాలను, వారి గౌరవాన్ని కాపాడే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. తాము ఎవరిపై ఎటువంటి ప్రతీకారచర్యలు తీసుకోబోమని, దేశంలో మళ్ళీ సుస్థిరతను నెలకొల్పడమే తమ ప్రధమ కర్తవ్యంగా భావిస్తున్నామని తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ అన్నారు. కనుక ప్రజలందరూ నిర్భయంగా తమ రోజువారీ పనులు చేసుకోవాలని కోరారు.
అయితే తాలిబన్ల చేతిలో అనేకానేక చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆఫ్ఘన్ ప్రజలు వారి ప్రకటనలను, మాటలను నమ్మడం లేదు. ఏదోవిదంగా దేశం విడిచి పారిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క కాబూల్ విమానాశ్రయం తప్ప దేశం సరిహద్దులన్నీ తాలిబన్లు, పొరుగు దేశాలు మూసివేయడంతో ఎటూ పారిపోలేక తీవ్ర భయాందోళనలో గడుపుతున్నారు. తాలిబన్ల అత్యాచారాల గురించి విన్న మహిళలు ఇప్పుడు తమపరిస్థితి ఏమవుతుందోనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన ఈ సంక్షోభం ఎప్పటికీ ముగుస్తుందో... తాలిబన్లకు ఎంతమంది బలవుతారో తెలీదు. ప్రస్తుతం తాలిబన్లు శాంతి ప్రవచనాలు పలుకుతూ ఎక్కడా హింసకు పాల్పడటం లేదు. ఈ భయానక పరిస్థితులలో ఇదొక్కటే ఆఫ్ఘన్ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విషయమని భావించవచ్చు.