సిఎం కేసీఆర్ నిన్న హుజూరాబాద్‌లో దళిత బంధు పధకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ సభకు హుజూరాబాద్ నియోజకవర్గంతో సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి, వాసాలమర్రి నుంచి ప్రజలను 825 బస్సులలో తరలించారు. సిఎం కేసీఆర్ సభకు మంత్రులు, అధికారులు, టిఆర్ఎస్ నేతలు అందరూ కలిసి భారీ ఏర్పాట్లు చేశారు. సభ విజయవంతమైంది.
అయితే ఈ సభపై ఈటల రాజేందర్ చాలా భిన్నంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పధకానికి మళ్ళీ ఇప్పుడు ఇంత హంగామా ఎందుకు? ఈ సభకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడేవి. కానీ ప్రజాధనంతో సిఎం కేసీఆర్ సొంత పార్టీ ప్రచారం చేసుకొన్నారు. దళిత బంధుతో హుజూరాబాద్‌తో సహా రాష్ట్రంలో దళితులందరికీ లబ్ది కలుగుతుందని చెపుతున్నప్పుడు, వారంతట వారు సభకు స్వచ్ఛందంగా వచ్చేవారు కదా?కానీ జనసమీకరణ చేసి వారిని బస్సులలో సభకు ఎందుకు తరలించవలసి వచ్చింది?అంటే సిఎం కేసీఆర్‌కు ప్రజలపై నమ్మకం లేకపోవడం వలననే. హుజూరాబాద్‌లో దళిత ప్రజలు కూడా సిఎం కేసీఆర్ మాటలను నమ్మడం లేదని గ్రహించినందునే. అందుకే సిఎం కేసీఆర్ జనసమీకరణ బాధ్యతను టిఆర్ఎస్ మంత్రులు, నేతలకు అప్పగించారు. సిఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో సభ నిర్వహించేందుకు వేలాదిమంది ప్రతిపక్ష కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
హుజూరాబాద్‌లో ప్రతీ దళిత కుటుంబానికి ఈ పధకం ద్వారా రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు కనుక ఉపఎన్నికలోపుగానే అందరికీ ఆ సొమ్ము చెల్లించాలి. వారు ఆ సొమ్మును ఏవిదంగా వినియోగించుకోవాలనే విషయం వారికే విడిచిపెట్టాలి. వారిపై అధికారులు ఒత్తిడి చేయకూడదు. సిఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ఇంకా ఎన్ని వేలకోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓటమి ఖాయం,” అని ఈటల రాజేందర్ అన్నారు.