దళిత బంధు 25 ఏళ్ళక్రితం ఆలోచన: సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ ఈరోజు హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దళిత బంధు పధకం ఈనాటి ఆలోచన కాదు. 25 ఏళ్ళ క్రితమే దళితులకు ఏదైనా చేయాలనే ఆలోచన నాలో ఉంది. దాని నుంచి పుట్టిందే ఈ పధకం. ఇంతకాలం దేశాన్ని పాలించి కాంగ్రెస్‌, బిజెపిలకు ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదో తెలీదు. ఈ పధకాన్ని గత ఏడాదే ప్రారంభించాలనుకొన్నాం కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. 

హుజూరాబాద్‌లో 21 వేల ఎస్సీ కుటుంబాలున్నాయి. వారిలో ప్రతీ ఒక్కరికీ ఈ పధకం ద్వారా ఆర్ధిక సాయం అందజేస్తాం. రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలున్నాయి. వారందరికీ కూడా దశలవారీగా ఈ పధకాన్ని అందజేస్తాం. ముందుగా ఎస్సీలలో తక్కువ ఆదాయం కలిగిన వారికి ఈ పధకాన్ని వర్తింపజేస్తాము. చివరిగా ఎస్సీలలో ప్రభుత్వోద్యోగులకు కూడా దీనిని వర్తింపజేస్తాము. త్వరలోనే మరో రూ.2,000 కోట్లు ఈ పధకం కోసం విడుదల చేస్తాను. ప్రభుత్వ కాంట్రాక్టులలో, మద్యం, ఎరువుల దుకాణాల లైసెన్సింగ్‌లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. దళిత బంధు పధకంతో రాబోయే నాలుగేళ్ళలో రాష్ట్రంలో దళితుల జీవితాలలో పెను మార్పులు రానున్నాయి. 

రాష్ట్రంలో మనం ప్రవేశపెడుతున్న మిషన్ భగీరధ వంటి పధకాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాగే ఇవాళ్ళ హుజూరాబాద్‌లో ప్రారంభిస్తున్న ఈ పధకం కూడా  యావత్ దేశానికి ఆదర్శ కావాలని కోరుకొంటున్నాను. దళిత బంధు పధకంపై అన్ని రాష్ట్రాలలోనూ ఇప్పుడు చర్చ మొదలవుతుంది. మనల్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాలలో ఇటువంటి పధకాలను ప్రవేశపెట్టినట్లయితే దేశంలో దళితులందరి జీవితాలలో పెను మార్పులు వస్తాయి. యావత్ ప్రపంచంలోనే ఇదో మహోద్యమం అవుతుందని భావిస్తున్నాను,” అని అన్నారు.