మల్కాజిగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న మల్కాజిగిరీ, జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దానిలో బిజెపి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘర్షణ జరుగుతున్నప్పుడు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశ్యించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఈరోజు ఉదయం నుంచే భారీ ఎత్తున బిజెపి కార్యకర్తలు మల్కాజిగిరి చేరుకొని తమ కార్పొరేటర్‌పై దాడిని, తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మైనంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ బంద్‌ నిర్వహిస్తున్నారు. బిజెపి మహిళా కార్యకర్తలు మైనంపల్లి ఇంటి ముందు బైటాయించి, తమ అధ్యక్షుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే మైనంపల్లి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ఆందోళనకారులు మల్కాజిగిరిలో దుకాణాలు మూయిస్తున్నారు. 

పోలీసులు వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జి చేసి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి తమ నాయకుడు బండి సంజయ్‌కు క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని బిజెపి కార్యకర్తలు చెపుతున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరిలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తపడుతున్నారు.