నేడు హుజూరాబాద్‌లో సిఎం కేసీఆర్‌ సభ

సిఎం కేసీఆర్‌ నేడు హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొని దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సభలో ఎంపిక చేసిన 15 మంది లబ్దిదారులకు సిఎం కేసీఆర్‌ స్వయంగా దళిత బంధు పధకం పత్రాలు అందజేస్తారని సమాచారం. నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గోల్కొండ కోట నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో హుజూరాబాద్‌లో నూటికి నూరు శాతం, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో పాక్షికంగా దళిత బంధు పధకం అమలుచేస్తామని తెలిపారు. కనుక ఉపఎన్నిక గంట మ్రోగేలోపుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 20,929 కుటుంబాలకు కూడా ఈ పధకం ద్వారా ప్రభుత్వం డబ్బు అందజేస్తుందా లేదా అనేది ఈరోజు సిఎం కేసీఆర్‌ సభలో స్పష్టత రావచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు రూ.7.6 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినా సంగతి తెలిసిందే. ఈరోజు హుజూరాబాద్‌ సభలో సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రజలకు పరిచయం చేసి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్ధించనున్నారు.