కష్టకాలంలోనే మన దేశం గొప్పదనం అందరికీ తెలిసింది: మోడీ

ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. అంతకు ముందు రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “75వ స్వాతంత్ర దినోత్సవ అమృత ఉత్సవాల సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది పోరాడారు. దేశం వారందరినీ స్మరించుకొంటోంది. అలాగే ఆనాడు దేశవిభజన సమయంలో అనేకమంది ధనమానప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మన వీరజవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులలో కాపలాకాస్తూ దేశాన్ని కాపాడుతుంటే, మన వైద్యులు, వైద్య సిబ్బంది దేశప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడుతున్నారు. ఈసారి మన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా వారందరికీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. 

భారత్‌పై కరోనా మహమ్మారి దాడి చేసినప్పుడు అనేకమంది దానికి బలయ్యారు. కానీ అతి తక్కువ సమయంలోనే మన శాస్త్రవేత్తలు దానికి టీకాలు తయారుచేసి దేశానికి అందించారు. ఆ తరువాత టీకాల కొరతతో చాలా ఇబ్బంది పడ్డాము. ఒకానొక సమయంలో భారత్‌లో అందరికీ టీకాలు అందించగలమా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అగ్రదేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నమాత్ర వాస్తవమే కానీ టీకాల సమస్యను కూడా మనం అధిగమించి ప్రపంచానికి మన శక్తిసామర్ధ్యాలు గుర్తించేలా చేశాం. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో చురుకుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 54 కోట్ల మందికి కరోనా టీకాలు అందజేశాము.

మరో 25 ఏళ్ళలో స్వాతంత్ర శతాబ్ది దినోత్సవాలు జరుపుకోబోతున్నాము. కనుక మనకు రాబోయే ఈ 25 ఏళ్ళను అమృతకాలంగా భావించి భారత్‌ సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి. దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములైతేనే ఇది సాధ్యపడుతుంది,” అని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.