
ప్లాస్టిక్ ఉత్పత్తులు సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో లభిస్తుండటం, చాలా ఉపయోగకరంగా కూడా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో రాన్రాను ప్లాస్టిక్ ఉత్పత్తులు, వినియోగం పెరిగిపోయి, ఇప్పుడు వాటితో పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారింది. కనుక ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్, ధర్మకోల్తో తయారయ్యే ఉత్పత్తులపై ఆంక్షలు, నిషేదం విధిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (సవరణ) నిబంధనలు-2021’ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
నిషేదిత ఉత్పత్తులలో ప్లాస్టిక్ మరియు ధర్మాకోల్ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, స్వీట్ బాక్సులు, ప్లాస్టిక్ ఫోర్కులు, కత్తులు, స్ట్రాలు, జెండాలు, ఆహ్వాన పత్రాలు, ఇయర్ బడ్స్కి వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఫ్లెక్సీ బ్యానర్లకు 100 మైక్రాన్లల కంటే తక్కువ మందం ఉన్న పీవీసీ షీట్లు వగైరా ఉన్నాయి.
వచ్చే నెల నుంచి 30 నుంచి 75 మైక్రాన్లల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు (కవర్లు) వినియోగంపై నిషేదం అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులపై పూర్తి నిషేదం అమలులోకి వస్తుంది.