తమిళనాడులో పెట్రోల్ ధర తగ్గింపు...కానీ ఏం ప్రయోజనం?

తమిళనాడులో పెట్రోల్ ధర లీటరుకు రూ.3 చొప్పున తగ్గింది. మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించేందుకుగాను పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం విదిస్తున్న సుంకంలో రూ.3 తగ్గించడంతో తమిళనాడులో లీటరు పెట్రోల్ ధర రూ.103 నుంచి రూ.100కి దిగింది. 

శుక్రవారం జరిగిన తమిళనాడు శాసనసభ సమావేశంలో ఆ రాష్ట్ర ఆర్ధికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ పునః సమీక్షించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిలో ఈ ప్రతిపాదన చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,160 కోట్లు నష్టం వస్తుందని కానీ దీని వలన సామాన్య, మధ్యతగతి ప్రజలకు చాలా ఊరట లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని త్యాగరాజన్ అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల పాపం పూర్తిగా కేంద్రప్రభుత్వానిదేనని ఆయన విమర్శించారు. 

తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్ సుంకం తగ్గించుకొన్నప్పటికీ, నానాటికీ పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కనుక మళ్ళీ రెండు మూడు వారాలలోపే లీటరు పెట్రోల్ ధర రూ.103కు చేరుకోవడం ఖాయం. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,160 కోట్లు నష్టపోయినా ప్రయోజనం లేదని స్పష్టం అవుతోంది. మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చెప్పినట్లు ఈ పాపభారం ఖచ్చితంగా కేంద్రప్రభుత్వానిదే. నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో దేశంలో సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే, కేంద్రప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.