
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు ప్రవేశించినప్పటి నుంచి ఒక్కసారిగా వేడి పెరిగింది. ఈటల రాజేందర్‌కు ఆయన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులలో ఎవరైనా హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాళ్ళు విసురుతున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో దళిత బంధు పధకం ‘గేమ్ ఛేంజర్’ అని టిఆర్ఎస్ భావిస్తున్నందున, టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉంది. కనుక టిఆర్ఎస్కు నిజంగా అంత నమ్మకమున్నట్లయితే తనపై సిఎం కేసీఆర్ లేదా మంత్రి హరీష్‌రావు పోటీ చేసి గెలవాలని ఈటల రాజేందర్ సవాలు విసురుతున్నట్లు అనుకోవచ్చు. వారు ఎలాగూ పోటీ చేయరు కనుక తన గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ గట్టిగా వాదించుకోవచ్చు కూడా.
కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే వారికి సవాళ్ళు విసురుతున్న ఈటల రాజేందరే చివరి వరకు పదవిని విడిచిపెట్టలేదు. మంత్రివర్గంలో బహిష్కరించిన తరువాత బిజెపిలో చేరితే అనర్హత వేటు పడకుండా తప్పించుకొనేందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చివరి నిమిషం వరకు పదవిని విడిచిపెట్టడానికి ఇష్టపడని ఈటల రాజేందర్ సిఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులను రాజీనామా చేసి ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసరడం అత్యాసే అవుతుంది.
అయినా ప్రతిపక్షాలు నిత్యం సిఎం కేసీఆర్, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇటువంటి సవాళ్ళు విసురుతూనే ఉంటాయి. ప్రతిపక్షాలు సవాల్ విసిరినప్పుడల్లా అధికారంలో ఉన్నవారు రాజీనామాలు చేయదలిస్తే ఏ ప్రభుత్వమూ నడువదు... ఎవరూ నడిపించలేరు కూడా.