.jpg)
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు బిజెపి నేతలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తన పాదయాత్ర రూట్ మ్యాప్ ప్రకటిస్తారు. తాజా సమాచారం ప్రకారం బండి సంజయ్ ఈనెల 24వ తేదీన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసిన తరువాత పాదయాత్ర మొదలుపెడతారు. సుమారు రెండు నెలలపాటు సాగే ఈ పాదయాత్రకు ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేశారు.
మొదటి రోజు మోహిదీపట్నం మీదుగా షేక్‌పేట వరకు పాదయాత్ర చేస్తారు. మర్నాడు ఉదయం గోల్కొండ కోట వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. అక్కడి నుంచి చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్ చేరుకొంటారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేవరకు రూట్ మ్యాప్ ప్రకారమే బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాదయాత్ర కోసం బిజెపి 30 కమిటీలను ఏర్పాటు చేసింది. అవి పాదయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, జనసమీకరణ చేస్తాయి.