హుజూరాబాద్ ఉపఎన్నిక టిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటంతో, ఈటల కూడా ధీటుగానే బదులిస్తున్నారు. నిన్న జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ, “హరీష్ నువ్వు నీ మామ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని నాగురించి తప్పుగా మాట్లాడుతున్నావు. మనం 18 ఏళ్ళు కలిసి పనిచేశాము కనుక ఒకరిగురించి మరొకరికి పూర్తిగా తెలుసు. పార్టీలో, ప్రభుత్వంలో నీకు అవమానాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు దిండు తడిసేవరకు కన్నీళ్ళు కార్చావో నాకు తెలుసు. కనుక ఏదో రోజున నువ్వు కూడా నా లెక్కనే పార్టీ నుంచి బయటకు వస్తావు. నువ్వు టిఆర్ఎస్‌లో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సంగతి నాకు ఎరుకే. కానీ నీకు ఆ అవకాశం ఎన్నటికీ దక్కదు. కేసీఆర్ కళ్లెదుటే టిఆర్ఎస్ పతనం అవుతుంది.
నా గురించి అబద్దాలు మాట్లాడుతూ ఓటర్లను వల్లో వేసుకోవాలని చూస్తున్నావు. నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు నేను సిద్దం. మరి నీ ఆస్తులు, సిఎం కేసీఆర్ ఆస్తులపై కూడా విచారణకు సిద్దామేనా? హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఇప్పటికే రూ.192 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా చాలా ఖర్చు చేయబోతున్నారని నాకు తెలుసు. మీరు డబ్బుతో గెలవాలని చూస్తుంటే నేను ప్రజల అభిమానం, ఆశీర్వాదాలతో గెలవాలని కోరుకొంటున్నాను. మీలాగా నేను ఉపఎన్నికలో గెలవడం కోసం వందల కోట్లు ఖర్చు చేయలేను. అవసరమైతే ప్రజలనే తలో వెయ్యి ఇవ్వమని అడిగి దానినే ఎన్నికలలో ఖర్చు పెడతాను.
కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాలలో మాత్రమే గుత్తేదార్ల సహకారంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించారు తప్ప రాష్ట్రంలో మరెక్కడైనా నిర్మించారా?నేను మంత్రిగా ఉన్నప్పుడు నా శక్తిమేర నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొన్నాను. ఈ విషయం ఇక్కడి ప్రజలకు కూడా తెలుసు. కనుక నా గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దు,” అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.