మంత్రిగా చేయనివాడు ప్రతిపక్షంలో కూర్చోంటే చేస్తాడా?

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్ మంత్రి హరీష్‌రావు బుదవారం ఇల్లందకుంటలో సభలో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌కు 4,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు మంజూరు చేస్తే వాటినీ పూర్తి చేయలేదు. పైగా రైతులు, దళితుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు, దళిత బంధు పధకాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని పట్టించుకోని వ్యక్తి ఒకవేళ ఉపఎన్నికలో గెలిచి ప్రతిపక్షంలో కూర్చోంటే ఏమి చేస్తారు? ప్రజలు ఆలోచించాలి. నియోజకవర్గం అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ఈటల రాజేందర్‌ కావాలా లేదా హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ పధకాలను తెచ్చిపెట్టే టిఆర్ఎస్‌ అభ్యర్ధి కావాలా?ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈటల రాజేందర్‌ తన ఎదుగుదలకు కారణమైన సిఎం కేసీఆర్‌ను గుండెలపై తన్ని వెళ్ళిపోయారు. ఏమాత్రం కృతజ్ఞత లేని ఇటువంటి వ్యక్తికా ఓటు వేయాలి? అసలు తనకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలో ఆయనే చెప్పాలి. 

ఈటల రాజేందర్‌ తనది వామపక్షభావజాలం అని గొప్పగా చెప్పుకొంటారు కానీ మతతత్వ పార్టీ అయిన బిజెపిలో చేరారు. అంటే ఆయనకు ఆశయాల కంటే తన ఆస్తులను కాపాడుకోవడం, పదవులే ముఖ్యం అని స్పష్టం అవుతోంది. కనుక నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోరుకొనే టిఆర్ఎస్‌ పార్టీకే ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఈటల రాజేందర్‌కు తగిన విదంగా బుద్ది చెపుతారని ఆశిస్తున్నాను,” అని మంత్రి హరీష్‌రావు అన్నారు.