
అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలతో భారత్ కీర్తి ప్రతిష్టలను యావత్ ప్రపంచదేశాలు గుర్తించేలా చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఒకేసారి వందకుపైగా ఉపగ్రహాలను విజయవంతంగా వాటి కక్ష్యలో ప్రవేశపెట్టి చూపడమే కాకుండా మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలతో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్దం అవుతోంది.
గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు నెల్లూరులోని శ్రీహరికోట ప్రయోగకేంద్రం నుంచి ఈఓఎస్-03 అనే ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. దీనిని ఇస్రో నమ్మినబంటు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈఓఎస్-03 ఉపగ్రహం ఆకాశంలో నుంచి నిఘా కాస్తుంటుంది. దీనితో యావత్ దేశాన్ని, భారత్, పాక్, చైనా సరిహద్దులను నిశితంగా గమనించవచ్చు. అందుకే ఇస్రో సంస్థ దీనికి ముద్దుగా ఐ ఇన్ ది స్కై అని పేరు పెట్టారు. దీని సాంకేతిక నామం జియో ఇమేజింగ్ శాటిలైట్-1. దేశ సరిహద్దు భద్రతతో పాటు దేశంలో అడవులు, నీటి వనరుల పరిస్థితి, వాటిలో వచ్చే మార్పులు, వరదలు, తుఫానులు మొదలైనవాటిని పర్యవేక్షించవచ్చు.