జైలుకి వెళ్ళే తొలి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డే: టిఆర్ఎస్‌

ఇంద్రవెల్లి సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి ఘోరీ కడతామంటూ విరుచుకుపడ్డారు. రేవంత్‌ విమర్శలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు.      

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసు తుది దశలో ఉంది. త్వరలోనే విచారణ పూర్తవగానే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. అప్పుడు జైలుకి వెళ్ళిన తొలి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించడం సంగతి తరువాత ఆలోచిద్దాం. త్వరలో జరుగబోయే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని రేవంత్‌ రెడ్డి గెలిపించుకోగలరా?ఆనాడు తెలంగాణ ఇవ్వకుండా పదేళ్ళు నాన్చుతూ వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అని విమర్శించిన నోటితోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అని రేవంత్‌ రెడ్డి పొగుడుతున్నారు. తెలంగాణలో సోనియా రాజ్యం వస్తుందని నిసిగ్గుగా చెపుతున్నారు. నాలుగు దశాబ్ధాల క్రితం ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఆదివాసీలను కాల్చి చంపింది. ఇప్పుడు అక్కడే కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం అంటూ సభ నిర్వహించడం విడ్డూరంగా ఉంది. రేవంత్‌ రెడ్డి నోటి తీట తీర్చుకోవడానికే అక్కడ సభ పెట్టినట్లుంది తప్ప ఆదివాసీల కోసం పెట్టినట్లు లేదు. చంద్రబాబునాయుడు తెర వెనక నుండి చక్రం తిప్పడం వలననే రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యారు కానీ కాంగ్రెస్‌ పార్టీలో నేతల మద్దతు లేదనే సంగతి ఆయనకు తెలుసు. దళిత బంధు పధకం ఒక్క హుజూరాబాద్‌లోనే కాదు యావత్ రాష్ట్రంలో అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ మొదటే చెప్పారు. కనుక దాని గురించి రేవంత్‌ రెడ్డి మాకు సలహా అవసరం లేదు,” అని అన్నారు.