దళిత బంధుకు మార్గదర్శకాలు జారీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పధకానికి కొన్ని మార్గదర్శకాలను మంగళవారం జారీ చేసింది. దాని ప్రకారం ఈ పధకంలో ఏయే ప్రాంతాలలో ఎటువంటి వ్యాపారాలు చేపట్టవచ్చో స్పష్టం చేసింది. గ్రామాలు, గ్రామాలు ఉప పట్టణాలు, గ్రామాలు-పట్టణాలు, పెద్ద పట్టణాలుగా విభజించి ఆయా ప్రాంతాలలో దళిత బంధు పధకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో చేసుకోదగ్గ 30 రకాల వృత్తులు, వ్యాపారాలను ప్రభుత్వం సూచించింది. ఆ వివరాలు: 

గ్రామాలలో 10-12 గేదెలతో మినీ డెయిరీల ఏర్పాటు, కూరగాయల పంటలు, వరినాటు యంత్రాల కొనుగోలు, పవర్ టిల్లర్, ఆటో ట్రాలీలు కొనుగోలు, వేపనూనె, వేపపిండి తయారీ.

గ్రామాలు, ఉప పట్టణాలలో ట్రాలీ ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, సాగుయంత్ర పరికరాలు అమ్మే దుకాణాల ఏర్పాటు, మట్టి ఇటుకల తయారీ కోళ్ళ పెంపకం.   

గ్రామాలు, పట్టణాలలో ఆటో రిక్షాలు, సరుకు రవాణా ఆటో ట్రాలీలు, విత్తనాలు, పురుగుల మందుల దుకాణాలు, ఆయిల్ మిల్లులు, పిండి గిర్నీలు, టెంట్ హౌస్, సౌండ్ అండ్ లైటింగ్ డెకరేషన్ వ్యాపారాలు వగైరా. 

 పెద్ద పట్టణాలలో నాలుగు చక్రాల సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాల కొనుగోలు, మందులు, హార్డ్ వేర్, శానిటరీ, టైల్స్, ఎలక్ట్రికల్, ఫోటో స్టూడియో వగైరా వివిద రకాల దుకాణాలు, హోటల్, క్యాటరింగ్, వెల్డింగ్ వర్క్ షాపులు ఏర్పాటు చేసుకోవచ్చునని పేర్కొంది.