టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే గాదరికి బెదిరింపు ఫోన్‌ కాల్

బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్‌, టిఆర్ఎస్‌ మద్య ఇంత తొందరగా యుద్ధం మొదలవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన టిఆర్ఎస్‌లో చేరి హుజూరాబాద్‌ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తే బీఎస్పీలో చేరి సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్న నల్గొండ సభలో ఆయన మరోసారి సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడంతో వెంటనే టిఆర్ఎస్‌ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌ ఆయనను బిజెపి ఏజంట్ అంటూ ప్రతివిమర్శలు చేశారు. గాదరి విమర్శలపై సంపత్ అనే స్వేరో కార్యకర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు ఫోన్‌ చేసి, నువ్వేంత నీ స్థాయెంత... ప్రవీణ్ సారును విమర్శిస్తావా? తోటి దళిత బిడ్డవని ఈసారికి విడిచిపెడుతున్నా మళ్ళీ మరోసారి ప్రవీణ్ సారుపై నోటికి వచ్చినట్లు వాగితే ఊరుకోను... అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఏడేళ్ళ బట్టి నీకు మీసారుకు దళితులు గుర్తురాలేదా ఇప్పుడే ఎందుకు వచ్చారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఏదో మాట్లాడబోతే ఏం? అప్పుడే భయం పుట్టిందా? మళ్ళీ పిచ్చిపిచ్చిగా వాగితే నా తడాఖా చూపిస్తా,” అంటూ హెచ్చరించాడు. దీంతో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా సహనం కోల్పోయి “అప్పుడే మీ పార్టీవాళ్ళు ఇలాగ  బెదిరింపులతో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారా?దమ్ముంటే నా ఎదుట నిలబడి మాట్లాడు బిడ్డా నేనేమిటో చూపిస్తా... ప్పుడే నీపై పోలీసులకి ఫిర్యాదు చేస్తా,” అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.