రేవంత్‌ రెడ్డికి ఎస్పీ రాజేష్ చంద్ర వార్నింగ్

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి దండోరా సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, తమ సభకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కలిగించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పందిస్తూ, “ఒక పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి ఈవిదంగా మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. ఆయన ఆరోపణల వలన పోలీస్ సిబ్బంది మనోస్థైర్యం దెబ్బ తింటుంది. వాస్తవానికి మేము అనుమతించిన దానికంటే చాలా ఎక్కువ మండే సభకు హాజరైనందున ఎవరికీ ఇబ్బంది కలగకుండా పోలీసులు చాలా కష్టపడి పనిచేశారు. ఇంద్రవెల్లి చాలా సున్నితమైన ప్రాంతం కావడం వలన సభలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నివారించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పించి సభకు భారీ భద్రత కల్పించాము. కానీ రేవంత్‌ రెడ్డి ఇవన్నీ గుర్తించకుండా మా పోలీస్ శాఖపై తప్పుడు ఆరోపణలు చేశారు. మళ్ళీ ఇటువంటివి పునరావృతమైతే ఈసారి ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడము,” అని హెచ్చరించారు.