
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ళలోనే అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. తీన్‌మార్ మల్లన్న, ప్రవీణ్ కుమార్ వంటి వ్యక్తులు కూడా అధికారం కోసం పోటీ పడుతున్నారు. గత ఏడేళ్ళుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరో రెండు మూడు దశాబ్ధాలు తామే అధికారంలో కొనసాగాలని ఆశిస్తోంది. కొనసాగుతామనే నమ్మకం కూడా ఉంది. కనుక తన అధికారాన్ని పదిలపరుచుకోవడానికి చేయవలసినవన్నీ చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటంతో దాని స్థానంలోకి ప్రవేశించిన బిజెపి బండి సంజయ్ నేతృత్వంలో టిఆర్ఎస్‌ను గట్టిగానే ఎదుర్కొంటోంది. టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకొనేందుకు తమ హిందుత్వ సిద్దాంతాన్ని పక్కన పెట్టి ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తూ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. వామపక్ష భావజాలం కలిగిన ఈటల రాజేందర్‌ను చేర్చుకోవడం ఇందుకు తాజా నిదర్శనం. మళ్ళీ ఎన్నికలప్పుడు అవసరమైతే హిందుత్వ అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగిస్తూ లబ్ది పొందే ప్రయత్నం కూడా చేస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటలను ముందుంచుకొని టిఆర్ఎస్‌ను ఓడించి సత్తా చాటుకోవాలని ఆరాటపడుతోంది. బిజెపి అంతిమ లక్ష్యం రాష్ట్రంలో అధికారంలోకి రావడమే... అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు.
టిఆర్ఎస్ దెబ్బకు ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్త ఉత్సాహం తెచ్చారని చెప్పవచ్చు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత టిఆర్ఎస్‌ను ఢీకొని నిలవగలమని... రాష్ట్రంలో అధికారంలోకి రాగలమనే చిన్న ఆశ కనిపిస్తోందిప్పుడు. హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధిని రేవంత్ రెడ్డి గెలిపించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లే భావించవచ్చు.
ఇటీవల ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి సభలోనే ఏనుగు(బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగు)పై కూర్చొని ప్రగతి భవన్‌కు వెళ్దామని చెపుతున్నారు. అంటే ఆయన కూడా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తీన్‌మార్ మల్లన్న కూడా 2023 శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను మట్టి కరిపించి అధికారంలోకి వస్తామని చెపుతున్నారు. ఈ ప్రయత్నంలో వారిరువురూ బడుబలహీన వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో వచ్చి రాష్ట్రంలో ఓదార్పు యాత్రలు మొదలు పెట్టారు. ఆమె కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కావాలంటే రాసి పెట్టుకోండని సవాల్ చేస్తున్నారు. ఆమె రాష్ట్రంలో క్రీస్టియన్స్, బడుగు బలహీన వర్గాల ప్రజలను, రెడ్డి సామాజిక వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని లేదా వారిని కూడగట్టి అధికారం చేజిక్కించుకొందామని ఆశ పడుతున్నట్లున్నారు. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం ఇంతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో వారిలో ఎవరు ఎంతవరకు సఫలం అవుతారనేది కాలమే చెపుతుంది.