
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) వరుసగా మూడోసారి ప్రతిష్టాత్మకమైన స్కైట్రాక్ అవార్డు దక్కించుకొంది. జీఎంఆర్ అధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గత ఏడాది ప్రపంచంలో అత్యుత్తమైన టాప్ 100 విమానాశ్రయాలలో 71వ స్థానంలో ఉండగా 2021లో 64వ స్థానానికి చేరుకొంది.
ప్రపంచవ్యాప్తంగా 550 అంతర్జాతీయ విమానాశ్రయాల గుండా రాకపోకలు సాగించే విమాన ప్రయాణికుల నుంచి స్కై ట్రాక్ సంస్థ ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ చేసి, వాటి ఆధారంగా ఈ అవార్డు, ర్యాంకింగ్ ఇస్తుంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా మూడు సంవత్సరాలు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోవడం పట్ల జీఎంఆర్ సంస్థ, గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ సంతోషం వ్యక్తం చేశారు.