మరో 20 నెలల తరువాత సోనియమ్మ రాజ్యం

ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో దళిత గిరిజన దండోరా సభ జరిగింది. ఈ సభకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఈ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి పాటు పడింది కాంగ్రెస్ పార్టీయే. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో బడుగుబలహీనవర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయే. ఆ తరువాత రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులను ఇచ్చి గౌరవించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినందునే దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో సమానావకాశాలు లభిస్తున్నాయని అందరికీ తెలుసు. ఆ రిజర్వేషన్ల వల్లే బాల్క సుమన్ వంటివారు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు పొందగలుగుతున్నారు. 

కనుక నాటికీ నేటికీ దేశంలో దళిత, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కాంక్షిస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ సిఎం కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. ఉప ముఖ్యమంత్రిగా దళిత బిడ్డ రాజయ్యను నియమించి అవినీతి ఆరోపణలతో పదవి ఊడగొట్టారు. కానీ నేటికీ ఆయన అవినీతి ఏమిటో చెప్పనేలేదు. నేటికీ తన మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఎన్నికలు రాగానే సిఎం కేసీఆర్‌కు దళితులు గుర్తొస్తారు...వెంటనే లక్షల కోట్లతో దళిత బంధు వంటి పధకాలను ప్రకటిస్తారు. సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ పధకాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అమలుచేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సిఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు చితికిపోయారు. మరో 20 నెలల్లో దేశంలో, రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రాబోతోంది. అప్పుడే దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పూర్తి న్యాయం జరుగుతుంది,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.