ప్రవీణ్ కుమార్‌ బిజెపి చేతిలో పావు: టిఆర్ఎస్‌

ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారి నిన్న నల్గొండలో జరిగిన రాజ్యాధికార సభలో సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. 

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు, పోలీస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్‌ మా ఉద్యమాలను అణగగదొక్కేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ కుమార్‌ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసినప్పుడు ఆయన స్వయంగా సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాల అమలు చేయించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సిఎం కేసీఆర్‌నే విమర్శిస్తున్నారు. 

ఆయన ఐపీఎస్ నియమనిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో కేంద్రప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకొనేందుకు సిద్దం అయ్యింది. అందుకే భయపడి ముందే తన పదవికి రాజీనామా చేసి దళితుల కోసం రాజీనామా చేశానని చెప్పుకొంటున్నారు. ఆయన కేంద్రం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసమే బీఎస్పీలో చేరారు తప్ప  దళితుల కోసం కాదు. ప్రతీ పదిపదిహేనేళ్ళకోసారి ఇటువంటి అధికారులు పార్టీలతో హడావుడి చేస్తుంటారు.   ఇటువంటివారి వలన ప్రజలలో అయోమయం ఏర్పడుతుంది తప్ప మరేమీ జరుగదు. కొన్ని రోజులకు వారు వారి పార్టీలు కనబడకుండాపోతాయి. యూపీలో చిరకాలం అధికారం చలాయించిన బీఎస్పీ అక్కడి బడుగు బలహీనవర్గాల కోసం ఏమి చేసిందో ప్రవీణ్ కుమార్‌ చెప్పగలరా? దళితులకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలరా?

నిజానికి ఆయన బిజెపి కుట్రలో భాగంగానే రాజకీయాలు మొదలుపెట్టారు. ఒక్కోరాష్ట్రంలో ప్రాంతీయపార్టీలను కబళించివేస్తున్న బిజెపి కళ్ళు తెలంగాణపై పడ్డాయి. టిఆర్ఎస్‌ను దెబ్బ తీయడం కోసం ప్రవీణ్ కుమార్‌ ద్వారా బిజెపి కుట్రలు పన్నుతోంది. 

రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతోందని గొంతు చించుకొంటున్న ప్రవీణ్ కుమార్‌, దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఇన్ని సంక్షేమ పధకాలు అమలవుతున్నాయేమో చెప్పగలరా?దళిత బంధు పధకం ద్వారా సిఎం కేసీఆర్‌ రాష్ట్రంలో దళితుల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తుంటే, ప్రవీణ్ కుమార్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరొక్కసారి సిఎం కేసీఆర్‌ గురించి అవాకులు చావాకులు వాగితే చూస్తూ ఊరుకోబోము, కనుక ప్రవీణ్ కుమార్‌ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది,” అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.