సిఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ సవాల్

బిజెపి నేత ఈటల రాజేందర్‌ సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులకు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తనపై పోటీ చేసి గెలవవలసిందిగా సవాల్ విసిరారు. ఆదివారం హుజూరాబాద్‌ మండలంలో చెల్పూర్‌లో ముదిరాజ్ కులస్థులు ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ బక్కపల్చని పిలగాడికి నియోజకవర్గంలో దిక్కులేదని సిఎం కేసీఆర్‌ అనుకొంటున్నారు. నేను చాలా చిన్నోడిని అంటారు. మరి నన్ను చూసి మీరందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు?ఏనాడూ నియోజకవర్గం మొహం చూడని మంత్రులు, ఎమ్మెల్యేలను ఇప్పుడే ఎందుకు దింపారు?నన్ను ఓడించేందుకు రూ. 5,000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? దళిత బంధు పధకం పేరుతో నియోజకవర్గంలో దళితులకు ఇప్పుడే డబ్బులు ఎందుకు పంచిపెడుతున్నారు? సంక్షేమ పధకాల పేరుతో గొర్రెలు, మేకలు పంచిపెడుతున్నమాట వాస్తవం కాదా?సిఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన లేదా మంత్రి హరీష్‌రావు ఇక్కడ నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నాను. ఉపఎన్నికలో గెలిచేందుకు సంక్షేమ పధకాల పేరిట మీరు ఎంత డబ్బు పంచిపెట్టినా, ఓటర్లకు ఎంత ప్రలోభపెట్టినా ఇక్కడ గెలిచేది నేనే. ఎందుకంటే నేను నీతి, నిజాయితీని, ప్రజలను నమ్ముకొన్నాను గనుక!

ఓటర్లు కూడా వాస్తవాలు గ్రహించాలి. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరదసాయం అంటూ హైదరాబాద్‌ వాసులకు రూ.10,000 చొప్పున పంచిపెట్టిన టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలవగానే దానిని ఇవ్వడం ఆపేసింది. ఓడ ఎక్కినప్పుడు ఓడ మల్లన్న... దిగిన తరువాత బోడి మల్లన్న అన్నట్లు సిఎం కేసీఆర్‌ వ్యవహరిస్తుంటారు. దళిత బంధు పధకం కూడా అంతే. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొనే హడావుడిగా ఈ పధకాన్ని ప్రకటించి అమలుచేస్తున్నారు.  అయితే టిఆర్ఎస్‌ ప్రభుత్వం పంచిపెడుతున్న సొమ్మంతా మీదే. కనుక ఇస్తే వద్దనకుండా తీసుకోండి కానీ తరువాత తెల్లగుడ్డలో బియ్యం, పసుపు పెట్టి టిఆర్ఎస్‌ అభ్యర్ధికే ఓటు వేస్తామని ప్రమాణాలు చేయమని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మాత్రం మాట ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఈవిదంగా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్న టిఆర్ఎస్‌కు బుద్ది చెప్పండి,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.