హైకోర్టులో తీన్‌మార్ మల్లన్న పిటిషన్‌

చింతపండు నవీన్ కుమార్‌ అలియాస్ తీన్మార్ మల్లన్న శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తన విచారణ పేరుతో వేదిస్తున్నారని, ఒక కేసు విచారణ చేస్తూ మరో కేసులో విచారణకు హాజరవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఈవిదంగా విచారణ పేరుతో వేదిస్తున్నారని కనుక తనకు సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్‌ ద్వారా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

మూడు రోజుల క్రితం ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు తీన్‌మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసింది. అతను తన ప్రతిష్టకు భంగం కలిగించేవిదంగా మాట్లాడారని కనుక అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు క్యూ న్యూస్ ఛానల్‌పై దాడి జరిపి సోదాలు చేసి కొన్ని హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత తీన్‌మార్ మల్లన్నను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళి ప్రశ్నించి విడిచిపెట్టారు. మళ్ళీ నిన్న విచారణకు హాజరుకావలసిందిగా ఆదేశించారు. కానీ నిన్న కరోనా టీకా వేయించుకోవలసి ఉన్నందున  విచారణకు హాజరుకాలేనని చెప్పారు. ఆ తరువాత ఆయన హైకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. సిఎం కేసీఆర్‌ పాలనను, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే పోలీసులతో తనను వేదిస్తున్నారని తీన్‌మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. అయితే ఇటువంటి వేదింపులకు తాను భయపడబోనని, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొంసాగిస్తానని తీన్‌మార్ మల్లన్న చెప్పారు.