
తెలంగాణ రాష్ట్రంలో వివిద శాఖలలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులు మొదలు దిగువస్థాయి ఉద్యోగుల వరకు అన్ని పోస్టులను కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థల ప్రకారం పునర్వ్యవస్థీకరిస్తూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఏకంగా 85 జీవోలు జారీ చేసింది. ఒక్క ఉపాధ్యాయపోస్టులు మినహా దాదాపు అన్ని పోస్టులకు స్థానికత, క్యాడర్, గ్రేడ్ వగైరాలు సవరించింది.
రాష్ట్రం ఏర్పడగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, ఆ తరువాత కొంతకాలానికి కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 124లో నిబందన ప్రకారం 36 నెలల గడువులోగా అంటే ఈనెలాఖరులోగా రాష్ట్రంలో అన్ని పోస్టులను పునర్వ్యవస్థీకరించవలసి ఉంటుంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అన్ని పోస్టులను పునర్వ్యవస్థీకరిచేస్తూ సాధారణ పరిపాలనా శాఖ నిన్న వరుసగా 85 జీవోలు జారీ చేసింది.
దీంతో ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత జిల్లాకు బదిలీ అవుతారు. అలాగే పదోన్నతులపై కూడా మరింత స్పష్టత వస్తుంది. కనుక జీవోల విడుదలపై ప్రభుత్వోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను నాలుగు దశలలో చేపట్టి సజావుగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కనుక ఈ ప్రక్రియ ముగియడానికి సుమారు 2-3 నెలలు పట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థల ప్రకారం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయితే ఇక నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ కూడా కొత్త జిల్లాలు, జోనల్ వ్యవస్థల ప్రకారమే జరుగుతుంది. కనుక ఆయా జిల్లాలో నిరుద్యోగులకు సొంత జిల్లాలోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతోంది కనుక ఇది పూర్తయ్యేవరకు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతయా లేదా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.