దళిత బంధు నిధులు విడుదల..వాసాలమర్రిలో ఆనందోత్సవాలు

సిఎం కేసీఆర్‌ నిన్న వాసాలమర్రి గ్రామంలో దళితవాడలో పర్యటించినప్పుడు అక్కడ నివశిస్తున్న 76 దళిత కుటుంబాలకు తక్షణం ఈరోజు 11 గంటలు కొట్టేలోగా దళిత బంధు పధకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆయన హైదరాబాద్‌ చేరుకోగానే దానికి సంబందించిన జీవోపై సంతకం చేసారు. వెనువెంటనే ఆర్ధికశాఖ రూ.7.60 కోట్లు నిధులు విడుదల చేసింది. ఆ సొమ్ము వాసాలమర్రి దళితుల బ్యాంక్ ఖాతాలలో జమా అయ్యింది. 

దీంతో గ్రామంలో దళితులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొంటూ సంబురాలలో మునిగి తేలుతున్నారు. గ్రామంలో దళితులందరూ డప్పులు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్ళి గ్రామం నడిబొడ్డున సిఎం కేసీఆర్‌ చిత్రపఠానికి పాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.సిఎం కేసీఆర్‌ దేవుడిలా ప్రత్యక్షమయ్యి తమకు ఇంత గొప్ప వారం ఇచ్చారని, కలలో కూడా ఊహించని అద్భుతం ఇదని వారు ఉప్పొంగిపోతున్నారు. 

దళిత బంధు పధకంలో లబ్ధిదారులకు ఇస్తున్న సొమ్ములో నుంచి రూ.10 వేలు చొప్పున కోసుకొని దానికి ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి దాంతో దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక రాష్ట్రంలో తొలిసారిగా నేడు విడుదలైన 7.60 కోట్లలో రూ.7.60 లక్షలకు ప్రభుత్వం మరో రూ.7.60 లక్షలు కలిపి దళిత రక్షణ నిధి ఖాతాలో జమా చేయనుంది.