మంత్రి గంగుల గ్రానైట్ కంపెనీకి ఈడీ నోటీసులు?

మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేతా గ్రానైట్ కంపెనీతో సహా కరీంనగర్‌ జిల్లాలో 8 గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ 8 కంపెనీలు చిరకాలంగా అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్‌ను కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, చెన్నైలోని పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయని భేతి మహేందర్ రెడ్డి అనే న్యాయవాది, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇంకా పలువురు రాజకీయ నాయకులు పీడీకి పిర్యాదులు చేశారు.

అవి ప్రభుత్వానికి చెల్లించవలసిన సీనరేజి ఫీజులు చెల్లించకుండా ఎగవేస్తూ అక్రమ మైనింగ్‌ చేసి దానిని విదేశాలకు ఎగుమతి చేసి కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నాయని వారు ఆరోపించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి అవి రూ.124.9 కోట్లు ఎగవేసినట్లు గుర్తించిన మైనింగ్ శాఖ వాటికి ఐదు రెట్లు అంటే రూ.749.66 కోట్లు జరిమానా విధించిందని తెలియజేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత సదరు కంపెనీలు రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్:6665/ఆర్‌1/2016 జారీ చేసి ఆ జరిమానాను మళ్ళీ రూ.124.9 కోట్లకు తగ్గించిందని తెలియజేశారు. కానీ గ్రానైట్ కంపెనీలు తగ్గించిన ఆ జరిమానాలో పదోవంతు కూడా చెల్లించకుండా నేటికీ ఆ కంపెనీలు అక్రమ మైనింగ్ చేస్తూ విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తూ కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నాయని వారు ఈడీకి ఫిర్యాదు చేశారు. 

ఈ పిర్యాదులపై స్పందించిన ఈడీ మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్ కంపెనీతో సహా 8 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. వాటితో పాటు చెన్నైలోని ఎలైట్ షిప్పింగ్ ఏజన్సీకి కూడా నోటీసులు పంపి కరీంనగర్‌ నుంచి ఎగుమతి చేసిన గ్రానైట్ వివరాలను అందజేయాలని ఆదేశించింది.