
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పధకానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 16వ తేదీన సిఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పధకం గురించి మరోసారి లోతుగా చర్చించి ఆమోదముద్ర వేశారు. ఈ పధకానికి పూర్తిస్థాయిలో చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. ఈ పధకం కింద లబ్ది పొందిన దళితులకు వారు ఎంచుకొన్న రంగంలో అవసరమైన శిక్షణ, సహాయసహకారాలు అందించాలని నిర్ణయించారు. దీనికి జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్లు బాధ్యతవహించాలని నిర్ణయించారు. ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకుగాను ప్రతీ జిల్లా కేంద్రంలో సెంటర్లో ‘ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్’ అనే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. వివిద శాఖలలో అదనంగా ఉన్న ఉద్యోగులు, అధికారులను వీటి కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ పధకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసింది.