
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఆన్లైన్లోనే కేసుల విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈనెల 9వ తేదీ నుంచి ప్రత్యక్ష విచారణలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శనివారం ఆదేశాలను జారీ చేసింది. ఆగస్టు 9 నుంచి ప్రతిరోజు ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యేక విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులను మాత్రమే ప్రత్యక్ష విచారణలో కేసులు వాదించేందుకు అనుమతిస్తామని తెలిపింది. కనుక కేసుల విచారణకు హాజరయ్యే న్యాయవాదులందరూ తప్పనిసరిగా రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలిపింది.