గోకుల్‌దాస్ ఇమేజెస్ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన

రాజన్న సిరిసిల్లా జిల్లాలో పెద్దూర్‌లోని అప్పారల్ పార్కులో గోకల్‌దాస్ ఇమేజెస్ అనే సంస్థ రెడీమేడ్ దుస్తులు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ కేటీఆర్‌ ఇవాళ్ళ దానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోకల్‌దాస్ ఇమేజెస్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ హిందూజాతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సమీర్ హిందూజా మీడియాతో మాట్లాడుతూ, 60 ఎకరాలలో రెండు లేదా మూడు పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని వాటిలో సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వారిలో అత్యధికశాతం మహిళలే ఉంటారని తెలిపారు. ఈ పరిశ్రమలో పనిచేసేందుకు మహిళలకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇక్కడ తయారైన రెడీమేడ్ దుస్తులు వివిద రాష్ట్రాలతో పాటు అమెరికాకు కూడా ఎగుమతి అవుతాయని తెలిపారు. ఈ పరిశ్రమలో పనిచేసే మహిళల కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ క్లినిక్, శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు సమీర్ హిందూజా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా మొదటి యూనిట్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణపనులు పూర్తిచేస్తామని తెలిపారు. 

 మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “సుమారు 16 ఏళ్ళ ఎదురుచూపులు తరువాత సిరిసిల్లాలో అప్పారెల్ పార్క్ ఏర్పాటుకాబోతోంది. జిల్లాలోని చేనేత, మరమగ్గం కార్మికులను ఆదుకొనేందుకే ప్రభుత్వం బతుకమ్మ చీరల పధకం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ యూనిఫారంలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ అప్పారల్ పార్కులో ఏర్పాటవుతున్న పరిశ్రమలన్నీ నిర్మాణపనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే రాబోయే రోజుల్లో ఇక్కడే 10,000 మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి,” అని అన్నారు.