ఈటల అవినీతిపరుడు..పోటీకి అనర్హుడు: మోత్కుపల్లి

టిఆర్ఎస్‌లో చేరేందుకు ఎదురుచూస్తున్న మోత్కుపల్లి నర్సింహులు సిఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగా ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఈటల రాజేందర్‌ తన పదవి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని 700 ఎకరాలు సంపాదించారు. దానిలో 40 ఎకరాలు దళితుల అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఇది ఆయనే స్వయంగా చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఈటల రాజేందర్‌ ఉపఎన్నికలో పోటీకి అనర్హుడు. కనుక ఎన్నికల సంఘం ఆయనను పోటీ చేయకుండా నిషేదించాలి.

పదవిలో ఉండగా దళితుల భూములు బలవంతంగా గుంజుకొన్న ఆయన ఇప్పుడు దళిత బంధు పధకాన్ని వ్యతిరేకిస్తుండటం ఆశ్చర్యం కాదు. ఈ పధకంతో దళితులు ఉన్నత చదువులు చదువుకొని బాగుపడితే వారు తమ మాట వినరనుకొనే ఈటల రాజేందర్‌ వంటివారే దీనిని వ్యతిరేకిస్తున్నారు. కానీ దేశంలో దళితుల జీవితాలలో వెలుగులు నింపడానికి లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన ఒకే ఒక మొనగాడు సిఎం కేసీఆర్‌. ఈ పధకాన్ని విజయవంతం చేయడంలో అందరూ ఆయనకు సహకరించాలి. దళితుల బాగు కోరుతున్న ఆయనను చూసి హుజూరాబాద్‌ ఉపఎన్నికలో దళితులందరూ టిఆర్ఎస్‌ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.