రాజశేఖర్ రెడ్డి తొత్తులా...మమ్మల్ని ప్రశ్నించేది?

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీకి వచ్చినప్పుడు కోమటిరెడ్డి సోదరులు అవరోధాలు సృష్టిస్తుండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుదవారం మునుగోడులో రేషన్ కార్డుల పంపిణీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కోమటిరెడ్డి సోదరులిద్దరూ జిల్లాలో దాదాగిరి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొంటుంటే మేము చూస్తూ ఊరుకోవడానికి మేమైనా కాంగ్రెస్‌ నేతలమా? రాజశేఖర్ రెడ్డికి తొత్తులుగా పనిచేసి నల్గొండ జిల్లాకు, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కోమటిరెడ్డి సోదరులా మమ్మల్ని ప్రశ్నించేది?తెలంగాణ సాధించుకొని వారి అధినేతలనే ఇక్కడి నుంచి తరిమికొట్టాము... మీరో లెక్కా? ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తరిమికొడతాం. కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ జిల్లాలో అభివృద్ధిపనులకు ఆటంకం కల్పించడం తప్ప వారి వలన మరే ప్రయోజనమూ లేదు,” అని అన్నారు.