ఈటలకు అనుచరులు షాక్... మళ్ళీ టిఆర్ఎస్‌ గూటికే

మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌కు ఆయన ముఖ్య అనుచరులు పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన ముఖ్య అనుచరులైన జమ్మికుంట మున్సిపల్ ఛైర్ పర్సన్‌ దేశిని స్వప్న, ఆమె భర్త దేశిని కోటి తాము టిఆర్ఎస్‌ గుర్తుపైనే గెలిచామని కనుక తాము టిఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతామని, సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని మంగళవారం ప్రకటించారు. వారితోపాటు ఇంతకాలం ఈటలకు అండగా నిలబడిన పలువురు కార్యకర్తలు కూడా టిఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. 

ఇటీవలే ఈటల రాజేందర్‌ ముఖ్య అనుచరుడు బండా శ్రీనివాస్ టిఆర్ఎస్‌ గూటికి చేరుకోవడం వెంటనే ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి లభించడం అందరికీ తెలిసిందే. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కీలకంగా భావిస్తున్న జమ్మికుంట, వీణవంకలో ఈటల రాజేందర్‌ ముఖ్య అనుచరులందరినీ టిఆర్ఎస్‌ వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యిందనే చెప్పాలి. 

ఆ రెండు మండలాలలో బిజెపి నాయకులు, కార్యకర్తలను కూడా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఆకర్షించగలిగారు. వీణవంకకు చెందిన 25 మంది బిజెపి కార్యకర్తలు మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. వరంగల్‌ అర్బన్ జిల్లాకు చెందిన పలువురు బిజెపి నేతలు వారి అనుచరులు కూడా నిన్న పరకాల టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు.              

ఈవిదంగా పెద్ద ఎత్తున ఈటల రాజేందర్‌ అనుచరులను, బిజెపి కార్యకర్తలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేస్తుండటంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌, బిజెపి, ఈటల రాజేందర్‌ బలాబలాలు క్రమంగా మారుతున్నాయి. హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ బలం పుంజుకొంటుండగా, బిజెపి, ఈటల క్రమంగా బలహీనపడుతున్నారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ ముఖ్య అనుచరులందరూ చేజారిపోతున్నారు. ఇది ఉపఎన్నిక ఫలితంపై తీవ్ర ప్రభావం చూపడం తధ్యం.