2.jpg)
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అనేకమంది నిసహాయులకు యధాశక్తిగా సాయం చేస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఆయన మరోసారి మానవత్వం చాటుకొంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపజేసారు.
ఈ ఘటన సోమవారం రాత్రి సిద్ధిపేట పట్టణ శివార్లలో జరిగింది. పట్టణంలో కాళ్లకుంట కాలనీకి చెందిన యాకూబ్ (30), జాఫర్ (26) అనే ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా బైపాస్ రోడ్డు వద్ద వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్‌లో సిద్ధిపేటకు వస్తున్నారు. దారిలో రోడ్డు పక్కన పడున్న ఆ ఇద్దరు యువకులను గమనించిన మంత్రి కేటీఆర్ వారిరువురినీ తన కాన్వాయ్‌లో సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపజేశారు. అంతేకాదు...ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆ ఇద్దరు యువకులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మంత్రి కేటీఆర్ సకాలంలో వారిరువురినీ తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేయడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది.