సోమవారం బిజెపికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి తనకు టిఆర్ఎస్ నుంచి ఆహ్వానం వచ్చిందని, ఒకటి రెండు రోజులలో నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. తనకు బిజెపితో ఎటువంటి ఇబ్బందీలేదని కానీ ఇటీవల ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం జీర్ణించుకోలేకనే పార్టీని వీడానని స్పష్టంగా చెప్పారు. తాను హుజూరాబాద్ టికెట్ కోసం టిఆర్ఎస్‌లో చేరడంలేదని సిఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వారికే మద్దతు ఇస్తానని అన్నారు.
అంటే పెద్దిరెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలని నిశ్చయించుకొన్నట్లు స్పష్టం అవుతోంది. టిఆర్ఎస్ నుంచి ఈటల నిష్క్రమణతో ఆ లోటును భర్తీ చేసుకొనేందుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను ఇటీవల పార్టీలో చేర్చుకొన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిజెపి నుంచి వస్తున్న పెద్దిరెడ్డిని కూడా టిఆర్ఎస్‌లో చేర్చుకొంటున్నారు.
వీరి ముగ్గురిలో కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగానే ‘తనకు టిఆర్ఎస్ టికెట్ ఖరారు అయ్యిందని, నియోజకవర్గంలో యువతకు పంచడానికి డబ్బు సంచులు కూడా సిద్దంగా ఉన్నాయంటూ’ ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడిన మాటలు మీడియాకు లీక్ అవడంతో టిఆర్ఎస్ విమర్శల పాలైంది. కనుక సిఎం కేసీఆర్ వీరి ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇస్తారా లేదా నాగార్జునసాగర్ ఉపఎన్నికలాగే ఈటల రాజేందర్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి కొత్త వ్యక్తిని బరిలో దింపుతారా...చూడాలి.