వేదికపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టిఆర్ఎస్‌ మంత్రి ఫైట్

 ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టగా, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడికి వచ్చి, స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియజేయకుండా, తాను లేకుండా ఏవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏదో చెప్పబోతుంటే రాజగోపాల్ రెడ్డి వేదికపైకి దూసుకువచ్చి ఆయన చేతిలో ఉన్న మైక్ లాక్కొన్నారు. అక్కడే ఉన్న టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఒకరికి వ్యతిరేకంగా ‘డౌన్‌...డౌన్‌...’ అంటూ మరొకరు బిగ్గరగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలాసేపు ఇరుపక్షాలు తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చేసుకోవడంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. 

ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలంటే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేనైన నాకు తెలియజేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి కదా?మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజాసమస్యలు పరిష్కరించకుండా, పధకాల గురించి మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.

 మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులకు అవరోధంగా మారారు. ఇకనైనా ఆయన తీరు మార్చుకోవాలి లేకుంటే ప్రజలే ఆయనకు తగిన విదంగా బుద్ది చెపుతారు. త్వరలోనే నేను నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు చేపడతాము,” అని అన్నారు.