కర్ణాటక సిఎం యడియూరప్ప రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నేను నా రాజకీయ జీవితంలో అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ రెండేళ్ళ కాలంలో కరోనాతో సహా అనేక సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాను. నేను ఈ పదవి చేపట్టక మునుపే మా అధిష్టానం నన్ను రెండేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని చెప్పింది. 75 ఏళ్ళ వయసులో నాకు ఇంత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. మా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరవహిస్తాను,” అని అన్నారు. 

సుమారు రెండేళ్ళ క్రితం చాలా నాటకీయంగా ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకొన్న యడియూరప్పకు బిజెపి అధిష్టానం ఇంత త్వరగా ఉద్వాసన పలకడం ఊహించినదే. అవినీతిపరుడిగా ముద్రపడిన యడియూరప్పకు తప్పనిసరి పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సివచ్చినప్పటికీ, ఆయనను ఇంకా కొనసాగిస్తే వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారం నిలబెట్టుకోవడం కష్టమని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కర్ణాటక రాజకీయాలలో చాలా బలవంతుడైన యడియూరప్పను పూర్తిగా పక్కకు పెట్టలేని నిసహాయత కూడా ఉంది. కనుక ఆయన సూచన మేరకు లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తినే కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి రావడం యడియూరప్ప జీర్ణించుకోవడం కష్టమే. కనుక ఆయనతో బిజెపికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.