
బిజెపి నేత ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో ప్రజాదీవెన పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధన కొట్లాడిన నావంటి అనేక మంది ఉద్యమకారులను సిఎం కేసీఆర్ బయటకు పంపించి, తెలంగాణ ద్రోహులను ప్రభుత్వంలొ చేర్చుకొని నిరంకుశ పాలన సాగిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఎవరూ తనకు ఎదురుచెప్పకూడదని కేసీఆర్ భావిస్తుంటారు. ప్రశ్నించిన నావంటి వారిపై అభాండాలు మోపి బయటకు పంపుతుంటారు. అందుకే పార్టీలో ఎవరూ ఆయనకు ఎదురుచెప్పలేక బానిస బతుకులు బతుకుతున్నారు. కానీ నేను టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ బానిస బతుకు నుంచి విముక్తి పొందాను. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడుతున్న మంత్రులు, టిఆర్ఎస్ నేతలు ఇంతకాలం ఏమయ్యారు? వారి నియోజకవర్గాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఇచ్చారో చెప్పగలరా?” అని ప్రశ్నించారు.
దళిత బంధు పధకం గురించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎన్నికలొస్తేనే సిఎం కేసీఆర్ కొత్త పధకాలు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చింది గాబట్టే దళితబంధు పధకం ప్రకటించారు. దాంతో ఓట్లు రాబట్టుకోవాలని ఆశపడుతున్నారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఇటువంటి ప్రలోభాలకు లొంగేవారుకారని కేసీఆర్ తెలుసుకొంటే మంచిది. ఈ ఉపఎన్నిక సిఎం కేసీఆర్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మద్య జరుగుతున్న యుద్దంవంటిది. దీనిలో అంతిమంగా ప్రజలే గెలుస్తారు,” అని ఈటల రాజేందర్ అన్నారు.