
గత 48 గంతలుగా నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. ఎగువన మహరాష్ట్రలో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులలోకి భారీగా వరదనీరు వస్తోంది. దీంతో బైంసాలోని గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తుండటంతో నిర్మల్, బైంసా పట్టణాలు నీట మునిగాయి. నిర్మల్ పట్టణంలోని ఆటోనగర్, సిద్దాపూర్, జీఎన్ఆర్ కాలనీ, ఇంద్రానగర్, శాస్త్రి నగర్, ఈద్గావ్, శివాజీగూడ, బోయవాడ, నటరాజ్ నగర్ లో ఇళ్ళు నీట మునగడంతో సహాయ బృందాలు ప్రజలను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని చెరువులు, వాగులు నిండి ఉప్పొంగి పట్టణంలోకి ప్రవహిస్తుండటంతో వాటితో భారీగా చేపలు కూడా కొట్టుకువచ్చాయి. దీంతో ప్రజలు వలలు పట్టుకొని రోడ్లపైనే చేపలవేట చేసి పెద్దపెద్ద చేపలను పట్టుకొన్నారు.
భారీగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరద నీటితో అనేక ప్రధాన రహదారులు కూడా నీట మునిగాయి. నిర్మల్-బైంసా, నిర్మల్-ఆదిలాబాద్, నిర్మల్-మంచిర్యాల రహదారులు పూర్తిగా నీట మునగడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాహనాలను వేరే మార్గాలకు మళ్లించారు.
నిర్మల్ జిల్లాలో 18 మండలాలో గత 24 గంటలలో సగటున 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్ (జి)లో అత్యధికంగా 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నుండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
A man heading home with his catch. #Nirmal pic.twitter.com/5bl2ZpSQpP