
బిజెపి నేత ఈటల రాజేందర్ నిన్న హుజూరాబాద్‌లో ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జిల్లాకు చెందిన ఓ మంత్రి నన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకోసం ఆయన ఓ కిరాయి హంతకులను ఏర్పాటు చేస్తున్నట్లు నా వద్ద సమాచారం ఉంది. అయితే ఇటువంటివాటికి భయపడి వెనకడుగు వేసేవాడిని కాను. ఈటల మల్లయ్య కొడుకుని నేను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడిని. నయీమ్ వంటి గూండాలకే నేను భయపడలేదు. ఇక మీరెంత? సదరు మంత్రిగారు ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానుకొంటే మంచిది.
2018 శాసనసభ ఎన్నికలలో నన్ను టిఆర్ఎస్ నేతలే ఓడించేందుకు కుట్రలు పన్నారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాపై కుట్రలు, కుతంత్రాలు చేయకుండా ఎలా ఉంటారు? కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలెప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకే 2018లో గెలిచాను. ఇప్పుడూ గెలుస్తాను. దుబ్బాక ఉపఎన్నికలో ఏమి జరిగిందో రేపు హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా అదే జరుగబోతోంది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడించి సిఎం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు బీజం వేస్తాను,” అని అన్నారు.
ఈటల ఉద్దేశ్యం ప్రకారం జిల్లాకు చెందిన మంత్రి అంటే గంగుల కమలాకర్ అని వేరే చెప్పక్కరలేదు. కనుక ఆయన ఈ ఆరోపణలపై వెంటనే స్పందిస్తూ, “ఓటమి భయంతో ప్రజల సానుభూతి పొందేందుకే ఈటల ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన బిజెపిలోనే ఉన్నారు కనుక ఈ ఆరోపణలపై సిబిఐ, ఎన్ఐఏలతో విచారణ జరిపించుకోవచ్చు కదా?ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని మేము కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని కూడా కోరుతాము. ఈటల ఆరోపణలలో నిజం లేదని మాకు తెలుసు. అయినా ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసేందుకు నేను సిద్దం,” అని అన్నారు.