
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా విజృంభించినప్పుడు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో హిందూ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మందితో జరిగిన కుంభమేళాను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. అలాగే సుప్రీంకోర్టు కూడా కలుగజేసుకోలేదు. కరోనా సమయంలో కుంభమేళా నిర్వహించడంపై దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండగా మళ్ళీ ‘కన్వర్ యాత్ర’ నిర్వహించేందుకు యూపీ, ఉత్తారాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి. అయితే ఈసారి సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకొని సంచలన తీర్పు వెలువరించింది. ప్రజలకు జీవించే హక్కు కంటే ప్రజల భావోద్వేగాలు, మతపరమైన హక్కులు ముఖ్యమైనవి కావని కనుక కన్వర్ యాత్రను విరమించుకోవాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీం తీర్పుకు కట్టుబడి కన్వర్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ యూపీ ప్రభుత్వం మాత్రం యాత్ర కొనసాగించడానికె మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. ఈ కేసుపై మళ్ళీ సోమవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
కన్వర్ యాత్రలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాలలో వేలాదిమంది భక్తులు గంగోత్రికి వెళ్ళి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి స్థానిక శివాలయాలలో అభిషేకాలు చేస్తుంటారు.